- గ్రేటర్ వరంగల్‌లో వరుసగా ఘటనలు
- మద్యం, గాంజా మత్తులో ప్రజలను వణికిస్తున్న ఆకతాయిలు
- మట్వాడా పీఎస్‌లో ఎస్సై, కానిస్టేబుళ్లపై దాడి
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కరీమాబాద్ ఎస్‍ఆర్‍ఆర్ తోటకు చెందిన క్యాతం రంజిత్, శ్యామాల సాయిరామ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ నెల 5న ఓ బార్ దగ్గర గొడవ చేసి పలువురిపై దాడికి యత్నించారు. స్థానికులు 100కు కాల్ చేయడంతో మట్వాడా పోలీసులు వచ్చి వారిని స్టేషన్ తరలించారు. కాగా, నిందితులిద్దరూ పీఎస్‌లోనూ బీభత్సం చేశారు. వారించిన ఎస్సైపై చేయిచేసుకున్నారు. అడ్డువచ్చిన హెడ్ కానిస్టేబుల్ బొమ్మ సుధాకర్, అశోక్‍పై దాడి చేయగా గాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసుల ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై కేసు నమోదైంది.
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌లో గంజాయి, డ్రగ్స్, మద్యం మత్తులో రౌడీమూకలు చెలరేగుతున్నాయి. అడిగింది ఇవ్వకుంటే షాపులపై దాడి చేస్తున్నారు. అడ్డుకునేవారిని కత్తులు, రాడ్లతో చితకబాదుతున్నారు. వరంగల్ సెంట్రల్ జోన్‍లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ మధ్యకాలంలో నిత్యం టెన్షన్ వాతావరణమే ఉంటోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నా నిందితులే స్టేషన్లోనే ఎస్సై, కానిస్టేబుళ్ల మీద దాడి చేయడం పరిస్థితికి అద్ధం పడుతుంది.
రౌడీలతో ఫ్రెండ్లీ పోలీస్‍పై విమర్శలు
గతంలో కత్తులతో హల్‍చల్ చేసే రౌడీమూకలు, గాంజా బ్యాచ్ లను కంట్రోల్ చేయడంలో సీపీ రంగనాథ్ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం కొన్ని నెలలుగా గ్రేటర్ వరంగల్ ప్రాంతంలో పోలీసుల పనితీరులో మార్పు వచ్చింది. వరుస దాడులు, హత్యలు జరుగుతున్నా, చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఎక్కువయ్యాయి. ‘‘ఫ్ల్రెండ్లీ పోలీస్ అనేది సామాన్యులకు తప్ప రౌడీలకు, గూండాలకు కాదని, సంఘవిద్రోహులపై పోలీసులు పనితీరు మార్చుకోవాలని” సీఎం స్థాయి వ్యక్తులు సభల్లో చెబుతున్నా వరంగల్ నగరంలో ఆ వాతావరణం కనిపించడం లేదు. ఏకంగా యూనిఫాంలో ఉన్న పోలీస్ అధికారులపైనే దాడులు జరుగుతున్నాయి.
వరంగల్ నగరంలో వరుస దాడులు..
వరంగల్ నగరంలో గడిచిన కొన్ని నెలలుగా రౌడీమూకలు దాడులు, బెదిరింపులకు దిగడం సాధారణమయ్యాయి. గాంజా, మద్యం మత్తులో ఉండే గ్యాంగ్‍లు ఎదుటివారిని లెక్కచేయడంలేదు. దాడులు సీసీ కెమెరాల్లో రికార్డ్అవుతున్నా భయపడట్లేదు.
మట్వాడా పీఎస్ పరిధిలో కొన్ని రోజుల కింద భద్రకాళి టెంపుల్ పెట్రోల్ పంప్ సమీపంలో ఓ ఆకతాయి అక్కడే ఉన్న ఆటోడ్రైవర్‍పై దాడి చేసే ప్రయత్నం చేశాడు. సెంట్రల్ జైలులో వార్డర్‍గా పనిచేసే సతీశ్ అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడిపై దాడి చేసి ఐడీ కార్డు చింపివేశాడు. ఈ సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కానిస్టేబుల్ వినయ్‍పై దాడి చేశాడు. ఎస్సై శివకృష్ణ సిబ్బందితో వచ్చి ఆపాల్సి వచ్చింది.
కాశీబుగ్గలో ఓ మహిళా అంత్యక్రియల సందర్భంగా జనాలతో రద్దీగా ఉండే చౌరస్తాలో పెద్ద శబ్దంతో కూడిన బాంబులు కాలుస్తుండటంతో ఓ కానిస్టేబుల్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. గల్లీ రాజకీయాలు చేసే ఓ వ్యక్తి డ్యూటీలో ఉన్న సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించగా, ఇతరులు ఆపారు.
మిల్స్ కాలనీ పీఎస్ పరిధి శంబునిపేట్‍లో రెండు రోజుల కింద ఓ వైన్స్ షాప్ వద్ద గాంజా బ్యాచ్ నానా బీభత్సం చేసింది. వైన్స్ షెట్టర్లు కిందకు వేసి సిబ్బందిపై దాడి చేసింది. టేబుళ్లు, కస్టమర్ల బైకులను ధ్వంసం చేశారు.
మిల్స్ కాలనీ పీఎస్ పరిధిలోనే ఐదు రోజుల కింద వరంగల్ పడమర కోట చమాన్ వద్ద చిల్లర గ్యాంగ్ రెచ్చిపోయింది. స్వీట్ షాప్ వద్దకొచ్చి వర్కర్లు, యజమాన్యంతో గొడవకు దిగారు. స్థానికులు ఆపే ప్రయత్నం చేసినా వినకుండా షాపులోకి చొరబడి తినుబండారాలు, స్వీట్లను రోడ్డుపై పడేసి హంగామా చేశారు.
మూడు రోజుల కింద హనుమకొండ కేయూ పీఎస్ పరిధిలోని గోపాల్ పూర్ వద్ద ఇద్దరు మిత్రులు మద్యం సేవించి నడిరోడ్డుపైనే గొడవకు దిగారు. కార్తీక్ అనే యువకుడు తన మిత్రుడు రామ్ చరణ్‍ను కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని స్థానికులు ఎంజీఎం తరలించారు.
గల్లీగల్లీలో గాంజా
నగరంలోని మేజర్ రౌడీమూకల ఘర్షణలకు గంజాయి మత్తులే కారణమవుతున్నాయి. ప్రస్తుతం పట్టణంలో గాంజా దొరకని గల్లీలు లేవనే చెప్పాలి. కాలేజీల ఏరియాల్లో విక్రయాలు సాధారణమయ్యాయి. పలుచోట్ల ముఠా సభ్యులు కొందరు స్టూడెంట్లనే గాంజా దందాకు ముందుపెడ్తున్నారు. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా యువత సరికొత్త మత్తులోకి దిగుతోంది. కాగా, వరంగల్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అడ్డుకట్టకు నార్కొటిక్, ఈగల్ టీంలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని చెబుతున్నప్పటికీ, కేవలం అవగాహన సదస్సులకే పరిమితమయ్యాయి.
